TDP: వైసీపీకి ఆ నిధులు ఎలా వచ్చాయ్
నిలదీసిన టీడీపీ నేతలు.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నారని విమర్శ..;
తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్‌పై బయటకు రాకుండా చేయాలన్న కుట్రతో సీఐడీ రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. న్యాయస్థానానాలే తప్పుదోవ పట్టించేలా స్కిల్ ప్రాజెక్ట్ నిధులు తెలుగుదేశం పార్టీకి మళ్లీంచారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాల ద్వారా వచ్చిన సొమ్ము, విరాళాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ఆదాయపన్ను శాఖలకు తెలియజేస్తున్నామన్నారు. అయితే దేశంలోనే అత్యంత భారీగా విరాళాలు పొందుతున్న ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో ఉందని, జాతీయ పార్టీలతో పోల్చితే ఐదో స్థానంలో ఉందని వారు ఆరోపించారు. ఆ పార్టీకి అంతంత నిధులు ఎలా వచ్చాయో సీఎం జగన్ చెప్పాలంటూ వారు నిలదీశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం ప్రాజెక్ట్‌ను మేఘా సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ సంస్థ 2020-21లో 22 కోట్ల విలువగల ఎలక్టోరల్ బాండ్లను వైసీపీకు విరాళంగా ఇచ్చింది. పోలవరాన్ని కట్టబెట్టినందుకే ఆ 22 కోట్లు తీసుకున్నారా అంటూ తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. 2016-17లో కంపెనీల నుంచి తెలుగుదేశానికి విరాళాల రూపంలో కేవలం 27 లక్షలు మాత్రమే వస్తే, జగన్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాదులు 27 కోట్లు వచ్చాయంటూ బురదజల్లుతున్నారని నిమ్మల రామానాయుడు, పట్టాభి మండిపడ్డారు. 2016-17లో పార్టీ సభ్యత్వ రుసుము, విరాళాలు, ఇతర మార్గాల్లో వచ్చిన మొత్తం ఆదాయం 72.92 కోట్లు కాగా అందులో సభ్యత్వ రుసుము ద్వారా వచ్చిందే 60.75 కోట్లని తెలిపారు.
వివిధ రకాల వ్యక్తులు, సంస్థల నుంచి డొనేషన్ల రూపంలో వచ్చింది 6.85 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ, అద్దెలు, ఇతరత్రా వచ్చిన ఆదాయం మరో 5.31 కోట్లు ఉందన్నారు. . మా పార్టీకి వచ్చిన ఆదాయం వివరాలు ఇంత స్పష్టంగా ఉంటే.. షెల్ కంపెనీల ద్వారా 27 కోట్లు వచ్చాయంటూ ఈ ప్రభుత్వం న్యాయస్థానాల్లో దుర్మార్గంగా ఆరోపిస్తోందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధాయ వివరాలు ఇంత పక్కాగా ఉంటే ... ప్రభుత్వ న్యాయవాది కోర్టులో అబద్ధాలు చెబుతున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. వైసీపీ అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న తెలుగుదేశం నేతలు... చంద్రబాబుకు బెయిల్ రావడంపై ధీమా వ్యక్తం చేశారు.