డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి బోణీ కొట్టింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది.
టీడీపీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు.
కూటమికి 164 సీట్లు కట్టబెట్టిన ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు.. ప్రజలు ఓట్లు వేసేస్తారని కలలో కూడా అనుకోవద్దని స్పష్టం చేశారు. పథకాల రూపంలో రూ.లక్షల కోట్లు వైసీపీ ఇచ్చింది. అయినా కూటమి అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. ఇటు వైసీపీ కంటే ఒకింత ఎక్కువ పథకాలే ప్రకటించిన కూటమి.. సంపద సృష్టించి పంచుతామంటోంది. అది కార్యరూపం దాల్చాలని కూటమిపై ఏపీ ప్రజానీకం ఆశలు పెట్టుకుంది.