అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో 9 మంది కూలీలు దుర్మరణం చెందడం తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారంతా మామిడి కోతకు సంబంధించిన కూలీలు అని సమాచారం వచ్చింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించాను. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది’’ అని పవన్ ట్వీట్ చేశారు.
అటు మంత్రి లోకేష్ సైతం ఘటనపై స్పందించారు. రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 9 మంది కూలీలు దుర్మరణం పాలవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో కూలీలు మృతి చెందడం బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.