ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ( Neerabh Kumar Prasad ) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు, సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుందన్నారు నీరబ్. మంచి చేసేలా కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయం వద్ద అధికారులు, సిబ్బంది నూతన సీఎస్ కు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. కొత్త సీఎస్ ను టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు ఆశీర్వదించారు. కొత్త సీఎస్ కు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.