తెలుగుదేశం పార్టీలో పదవుల పండుగ రాబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత వైసిపి హయాంలో టిడిపి నేతల తీరును ఆయన జాగ్రత్తగా పరిశీలించారు. ఎవరు పార్టీ కోసం నిలబడ్డారు.. ఎవరు కీలక సమయాల్లో చేతులెత్తేశారు.. భవిష్యత్తులో ఎవరికి అవకాశం ఇస్తే పార్టీకి మనుగడ ఉంటుంది అనే విషయాలపై ఆయన కూలంకుషంగా చర్చ జరిపారు. ఈ మేరకు టిడిపిలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిల పదవులతో పాటు.. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీని కూడా త్వరలోనే వేయబోతున్నారు.
ఈసారి ఎక్కువగా యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. జగన్ హయాంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే టిడిపిలో ఎక్కువగా పని చేసింది మాత్రం యువ నాయకులే. పార్టీ సీనియర్లు చాలావరకు సైలెంట్ గా ఉంటే యువ నాయకులే ముందుండి పోరాడారు. చేతిలో డబ్బులు లేకపోయినా సరే.. పార్టీ జెండాను మాత్రం వీడలేదు. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వెనకడుగు వేయకుండా పోరాడారు. పైగా రేపు రాబోయే రోజుల్లో కీలక నాయకులుగా ఎదిగే అవకాశం యువతకే ఉంటుంది కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
యువకులు ఎక్కువగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ చురుగ్గా పనిచేస్తుంది. ఆ విషయం సీఎం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. పైగా రాబోయే రోజుల్లో నారా లోకేష్ కు అండగా ఉండాల్సింది ఇప్పుడున్న యువ నాయకులే. వారికి అవకాశం ఇచ్చి వారిని సమర్థవంతమైన నాయకులుగా తీర్చి దిద్దితే రేపటి రోజున లోకేష్ నాయకత్వంలో వారందరూ సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి డబ్బున్న వారి కంటే.. పార్టీలో సీనియర్ల కంటే నిష్పక్షపాతంగా పనిచేసిన యువకులకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు సమాచారం.