సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు ఆయన్ను విచారించారు. గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రం ప్రొమోషనల్ లో భాగంగా రాంగోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కించపరిచేలా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చిన ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాననీ, వేరొక రోజు వస్తానని వాట్సప్ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో వర్మ విచారణకు హాజరయ్యారు. వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చారని పోలీసులు చెప్పుకుంటున్నారు.