ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. జులై 20న అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,-ప్రకాశం శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.