నకిలీ చలానా స్కామ్‌ను ఆధారాలతో సహా బయటపెట్టిన టీవీ5..!
ఏపీలో వెలుగుచూసిన నకిలీ చలానా స్కామ్‌ను టీవీ5 ఆధారాలతో సహా బయటపెట్టింది.;
ఏపీలో వెలుగుచూసిన నకిలీ చలానా స్కామ్‌ను టీవీ5 ఆధారాలతో సహా బయటపెట్టింది. విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగులే.. నకిలీ చలాన్లతో పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. 2 లక్షల 32వేల 400 రూపాయల చలానా కట్టాల్సి ఉండగా.. పటమట సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంటరీ రైటర్‌తో కుమ్మక్కై కేవలం 200 రూపాయలు మాత్రమే చలానా కట్టించుకోవడం విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
మరో చలానా విషయంలోనూ ఇంతే భారీ మోసం జరిగింది. 22 లక్షల 33వేల 70 రూపాయల చలానాకు.. కేవలం 100 రూపాయలు నకిలీ చలానా కట్టించుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు సబ్ రిజిస్ట్రార్లు. ఇది విజయవాడ పటమట కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన స్కామ్ మాత్రమే. ఇంకా వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయని సాక్షాత్తు ఉద్యోగులు, అధికారులే మాట్లాడుకుంటున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా సంబంధిత అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నకిలీ చలానా స్కామ్ వ్యవహారంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా, విచారణ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.