Jagan Job Calender : జగన్ జాబ్ క్యాలెండర్‌పై నిప్పులు చెరుగుతున్న నిరుద్యోగులు..!
Jagan Job Calender : జగన్ నవ్వూతూ చూపించిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది పచ్చి మోసం అంటూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.;
Jagan Job Calender : జగన్ నవ్వూతూ చూపించిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది పచ్చి మోసం అంటూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలైతే జగన్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై కాకినాడలో నిరసన సెగలు రగిల్చారు నిరుద్యోగ యువత. ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలైతే.. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 2019 ఎన్నికల హామీలో ప్రకటించిన లక్ష 42 వేల ఉద్యోగ ఖాళీలు ఎటుపోయాయి అని ప్రభుత్వానికి ఎదురుతిరిగారు.
ఏటా 6వేల చొప్పున మూడేళ్ల పాటు 24వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాటలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించింది ఏపీ నిరుద్యోగ జేఏసీ. 470 పోలీస్ ఉద్యోగాలను రోస్టర్ విధానంలో చూసినా కులానికి 50 ఉద్యోగాలు కూడా లేవని ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతున్నారు.పోలీసు శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 470 పోస్టులకు ప్రకటించి ఏం సాధిద్దామనుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీలోని నిరుద్యోగులు. 25 వేల డీఎస్సీ టీచర్ల పోస్టులు ఉంటే.. కనీసం చెప్పుకోడానికైనా ఒక్క ఖాళీని కూడా నింపలేదని మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఒక చీటింగ్ క్యాలెండర్ అని, మాయమాటలు, అంకెల గారడీ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శిస్తున్నారు నిరుద్యోగులు.
అధికారంలోకి వస్తే 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్.. కొసరుగా ఉన్న ఆ 30వేల ఉద్యోగాలు కూడా ప్రకటించకపోవడం దారుణం అంటూ టీడీపీ విమర్శించింది. జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలండర్ కంటే మార్కెట్లో దొరికే మాములు క్యాలెండర్ బెటర్ అంటూ కామెంట్ చేశారు అచ్చెన్నాయుడు. సాధారణ క్యాలెండర్‌లో కనీసం రాశి ఫలాలు అయినా చూసుకోవచ్చని అచ్చెన్న ఎద్దేవా చేశారు. రూపాయి పని చేసి, దాన్నే వంద రూపాయలుగా చెప్పుకుంటూ.. మళ్లీ దానికి 10 ఖర్చు పెడుతున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనంటూ విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు.