Vangalapudi Anitha: విజయమ్మ పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారా?.. వనితకు అనిత కౌంటర్..
Vangalapudi Anitha:విజయమ్మ తప్పుడు పెంపకం వల్లే జగన్ జైల్లో ఉన్నారా అని వనితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వంగలపూడి అనిత;
Vangalapudi Anitha: విజయమ్మ తప్పుడు పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారా అంటూ హోంమంత్రి తానేటి వనిత కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఏపీలో పసి పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా తల్లిదే తప్పా అంటూ ప్రశ్నించారు. మహిళ అయి ఉండి తల్లి గురించి నీచంగా మాట్లాడడం బాధాకరం అన్నారు. ఇష్టానుసారం తల్లులు, తల్లుల పెంపకంపై మాట్లాడితే తాట తీస్తామన్నారు. ఏపీలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి తానేటి వనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తల్లుల పెంపకం సరిగ్గా ఉంటే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయంటూ మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అత్యాచార ఘటనలు, మహిళల రక్షణ విషయంలో తల్లుల పాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. తల్లులు తమ పాత్ర తాము సరిగ్గా పోషించకుండా ఇలాంటివి ఆపలేకపోతున్నందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌పైన, ప్రభుత్వంపైన నిందలు వెయ్యడం సరికాదని అన్నారు. పిల్లల్ని పెంచే విషయంలో తల్లులకు సూచనలు చేస్తూనే.. అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.