ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొన్ని రోజుల్లో వేడి, ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరగవచ్చని పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ అంచనాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 12 నుంచి 18 మధ్య ఉత్తర కోస్తాలో కూడా ఎండల తీవ్రత పెరగవచ్చని పేర్కొంది. ఇప్పటికే నరసాపురం, బాపట్ల, కావలి వంటి ప్రదేశాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
వర్ష సూచన:
ఎండల తీవ్రతపై హెచ్చరికలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వర్ష సూచన కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ వాతావరణ నమూనాల ప్రకారం, ఈ నెల 10 తర్వాత వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.