Road Accident : రోడ్డు ప్రమాదంలో భార్య మృతి...గుండెలవిసేలా రోదించిన భర్త...
కడదాక తోడు ఉండాల్సిన భార్య కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ భర్త తట్టుకోలేక పోయాడు. వృద్ధాప్యంలో ఒకరికి ఒకరుగా బతుకుతున్న ఆ దంపతులను విధి విడదీసింది. కట్టుకున్న భార్య కళ్లముందే మృతి చెందడంతో భర్త తట్టుకోలేక పోయాడు.ఈ విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది.
వివరాల ప్రకారం లంకెలపాలెం శ్రీ రంగ నగర్ కాలనీ కి చెందిన దాసరి లక్ష్మణరావు, ఆదిలక్ష్మి(67) లు భార్యాభర్తలు. సంతోషంగా బతుకుతున్న వాళ్ల జీవితాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. తమ కూతురిని చూసి వద్దామని బయలుదేరిన ఆ దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న పెద్ద కుమారై ను చూసేందుకు బయలు దేరారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా గాజువాక నుంచి అనకాపల్లి వెళుతున్న సిమెంట్ లారీ ఆదిలక్ష్మిని ఢీ కొట్టింది. దీంతో ఆది లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య మృతి చనిపోవడం తో ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన రోధించిన తీరు స్థానికులను కూడా కన్నీళ్లు పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.