APPCC: షర్మిల మాట అధిష్టానం వింటుందా?

ఏపీలో నూతన కార్యవర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం... షర్మిల జాబితాకు ఆమోదముద్రపై అధిష్టానం దోబూచులాట;

Update: 2024-08-31 05:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు ముందు హడావుడిగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిని కాంగ్రెస్‌ పార్టీ మార్చింది. ఏపీలో పట్టున్న వైఎస్ కుటుంబానికి బాధ్యతలు అప్పజెప్పింది. అందులోనూ ఓ పార్టీకి అధ్యక్షురాలైన షర్మిలను పార్టీలో చేర్చుకుని, పార్టీని వీలినం చేసుకుని ఆమెకు ఏపీలపీసీసీ పదవిని అప్పజెప్పారు. 2024 ఎన్నికలకు కొద్ది సమయం ముందు పార్టీ బాధ్యతలు తీసుకున్నా బాగానే కష్టపడింది. ఆమె రాకతో కాంగ్రెస్ పేరు రాష్ర్టంలో కాస్తయినా వినబడింది. ఢిల్లీ, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. దీంతో ఓ మోస్తరుగా ఓట్ల శాతం పెంచుకుంది కాంగ్రెస్.

కార్యవర్గం ఏర్పాటులో జాప్యం..

పార్టీలో పదవులను భర్తీ చేసేందుకు షర్మిల ఓ జాబితాను హైకమాండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. తన జట్టును ఇప్పటినుంచే వచ్చే 2029 ఎన్నికల నాటికి పటిష్టం చేయాలనే ఆలోచనతో ఈ జాబితాను షర్మిల కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇచ్చింది. కానీ ఏపీలో పీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో హైకమాండ్ తీవ్ర జాప్యం చేస్తోంది. అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. షర్మిలపై పూర్తి విశ్వాసం ఉంచి పీసీసీ పగ్గాలు అప్పగించినా..పార్టీ పదవులపై ఆమె అందజేసిన జాబితాకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సీనియర్ల అడ్డగింత..

గత రాజకీయ అనుభవాల దృష్ట్యా పార్టీలో పట్టు బిగించేందుకు.. పార్టీకి జవజీవాలు ఇచ్చేందుకు పీసీసీ రాష్ట్ర కమిటీలలో తనతో పాటు ఉండే అత్యంత నమ్మకస్తులైన వారి పేర్లను షర్మిల గత ఢిల్లీ పర్యటనలో హైకమాండ్‌కు అందజేశారు. అయితే, మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన నేతలను కాదని, ఎక్కువగా షర్మిల తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పదవుల భర్తీ మరింత ఆలస్యం కానుంది. ఈ కారణంగానే షర్మిల సమర్పించిన లిస్ట్కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే టాక్ నడుస్తోంది. అయితే షర్మిల మాత్రం తన మద్దతుదారులకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా … పార్టీని గాడిన పెట్టాలంటే అసాధ్యమని భావిస్తున్నారు. దీంతో పార్టీలో ఎలాంటి అసంతృప్తి రాగాలకు చోటు లేకుండా..పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కొద్ది రోజులు ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News