సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు లేఖ

మత్స్యకారులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సీఎం జగన్‌కు యనమల లేఖ రాశారు.

Update: 2020-12-19 15:26 GMT

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమ వల్ల పర్యావరణ ముప్పు ఏర్పడుతుందని ధ్వజమెత్తారు. దీనిపై సీఎం జగన్‌కు యనమల లేఖ రాశారు. మత్స్యకారులు, రైతులు, మహిళలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అటు ప్రజాస్వామ్యానికి, ఇటు పర్యావరణానికి ముప్పు తెస్తున్నారంటూ లేఖలో ఆక్షేపించారు. 160 మందిపై తప్పుడు అభియోగాలతో అక్రమ కేసులు పెట్టడంపై ధ్వజమెత్తారు. తొండంగి మండలంలో వందలాది మంది పోలీసులతో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం మత్స్యకారులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు. అలాగే దివీస్‌ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. కోన ప్రాంతంలో ఎలాంటి రసాయన పరిశ్రమలు, బల్క్ డ్రగ్స్‌ ఇండస్ట్రీలు ఏర్పాటు నిర్ణయాన్ని విరమించాలన్నారు. నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ఆర్థిక సాయం చేసి, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని యనమల డిమాండ్‌ చేశారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని యనమల అన్నారు. కోన ప్రాంతంలో రసాయనిక పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందని... హేచరీస్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై టీడీపీ సహా ప్రతిపక్షాల హెచ్చరికలను బేఖాతరు చేయడం గర్హనీయమని.. ప్రశాంతమైన గోదావరి జిల్లాలను అల్లకల్లోలం చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు యనమల రామకృష్ణుడు. ఇకనైనా చేసిన తప్పులను సరిదిద్దుకుని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని హితవు పలికారు.


Tags:    

Similar News