AP: బీజేపీ నేతను చెప్పుతో కొట్టిన వైసీపీ ఎంపీ అభ్యర్థి
సీఎం రమేష్‌పైనా దాడి.... రెచ్చిపోయిన వైసీపీ నేతలు;
అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి స్వగ్రామం తారువలో వీరంగం సృష్టించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కూటమి నాయకులపై దాడికి తెగబడ్డారు. కూటమి నాయకులకు మద్దతుగా సీఎం రమేష్ తారువకు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్నికల సమీపిస్తున్నా అధికార పార్టీ నాయకుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తారువలో ప్రచారానికి వెళ్లిన కూటమి నాయకులపై దాడులకు తెగబడ్డారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఓ బీజేపీ కార్యకర్తను చెప్పుతో కొట్టారు. వైసీపీ నాయకుల దాడిలో నలుగరు కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
కూటమి నాయకులకు మద్దతుగా అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తారువకు వెళ్లారు. సీఎం రమేష్‌ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై కర్రలతో దాడి చేశారు. వైసీపీశ్రేణుల దాడిలో సీఎం రమేష్ కారు, రెండు బైకులు ధ్వంసమయ్యాయి. దీంతో తారువ రణరంగాన్ని తలపించింది.సీఎం రమేష్‌ని తారువ నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో రమేష్‌ని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలో దాడికి తెగబడి.... సీఎం రమేష్ చొక్కా చించేశారు. ఈ దాడిలో సీఎం రమేష్‌కు చెందిన మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అనంతరం సీఎం రమేష్‌ని పోలీసులు దేవరపల్లికి తరలించారు.
తారువ గ్రామంలో రమేష్‌ను అరెస్ట్ చేసి.. పోలీసు జీపులో తరలించారు. సీఎం రమేష్ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె కన్నెర్రజేశారు. రమేష్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని.. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో ఈ పనులు చేయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. మరోవైపు రమేష్ అరెస్ట్ కూటమిలోని కీలక నేతలు తీవ్రంగా స్పందించారు. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.