తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను ఆసరాగా చేసుకుని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న వైసీపీ 'అసత్యాల పర్వం' పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతోందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తే.. గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ ఈ వ్యూహం పన్నినట్లు స్పష్టమవుతోంది.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు తెరలేపింది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకొని తీవ్ర దుష్ప్రచారానికి తెరలేపారు. జల వనరుల వినియోగంపై కేంద్రం వద్ద సరైన వాదనలు వినిపించడంలో గత ప్రభుత్వం విఫలమవడమే కాకుండా, ఇప్పుడు అధికార పక్షంపై నిందలు వేయడం 'దొంగే దొంగ అన్నట్లు' ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జల వివాదాల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను తప్పుగా చిత్రీకరిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు జగన్ పార్టీ విశేషంగా యత్నిస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని వక్రీకరించి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ అసత్యపు కథనాలను ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రతి చుక్క నీటిని సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, తాము వాటిని గాడిలో పెడుతుంటే ఓర్వలేకనే ఇటువంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయం ఏదైనా సరే.. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే అన్ని పార్టీలు ఒక్కటిగా ఉండాలి. కానీ అధికారం కోల్పోయిన ఆవేదనతో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న వైసీపీ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వైసీపీ నాయకులు ఏదో ఆశించి చేస్తున్న దుష్ప్రచారం వారికే చేటు చేస్తుందని చెబుతున్నారు.