Amaravati: రాజధాని అమరావతిలో భూముల అమ్మకం.. ఏకంగా 248 ఎకరాలు..

Amaravati: అమరావతి ఒక శ్మశానం, ఎడారి అన్న జగన్ ప్రభుత్వమే.. ఇప్పుడు అక్కడ ఎకరం ధర 10 కోట్లు పలుకుతుందని నిర్ధారించింది.

Update: 2022-06-26 12:15 GMT

Amaravati: ఒక శ్మశానంలో, ఒక ఎడారిలో ఎకరం ధర పది కోట్ల రూపాయలు ఉంటుందా? అమరావతి ఒక శ్మశానం, ఎడారి అన్న జగన్ ప్రభుత్వమే.. ఇప్పుడు అక్కడ ఎకరం ధర 10 కోట్లు పలుకుతుందని నిర్ధారించింది. నిర్ధారించడమే కాదు.. ఉన్నఫళంగా 248 ఎకరాలు అమ్మేసి 2480 కోట్లు తెచ్చుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది జగన్ సర్కార్. వచ్చే జులైలోనే ఈ భూముల అమ్మకం మొదలుపెడుతోంది. రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వానికి కనీసం 3500 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. ఇందుకోసం అప్పు చేయాలనుకుంది ప్రభుత్వం.

అయితే, ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే అప్పులు ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి. కాని, ఈ రుణాలకు గ్యారెంటీగా ఉండేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడలేదని తెలుస్తోంది. చేసేది లేక భూములు అమ్మేందుకు సీఆర్‌డీఏ ఓ ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న 248 ఎకరాలను గత ప్రభుత్వం వేరే వాటికి కేటాయింపులు చేసింది. మెడ్‌సిటీ కోసం 100 ఎకరాలు, లండన్‌ కింగ్స్‌ కాలేజీ నిర్మాణానికి 148 ఎకరాలు ఇచ్చారు. అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ప్రకటించడంతో.. ఆ అనిశ్చితి కారణంగా పలు కంపెనీలు ముందుకురాలేదు.

సంస్థలు నిర్మాణాలు చేయకపోవడంతో వీటిని వేలం వేయాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం. కేవలం 248 ఎకరాలే కాదు.. ఏటా 50 ఎకరాల చొప్పున 600 ఎకరాలు అమ్మే ప్రయత్నంలో జగన్ ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే, రాజధాని భూములు కొనేందుకు ఎవరు ముందుకొస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజధానిని అభివృద్ధి చేసి భూములు అమ్మితే పది కోట్లు కాదు ఎకరం 50 కోట్లపైనే పలుకుతుందని, ఇప్పుడు పది కోట్ల ధర నిర్ధారించినా ఎవరూ రారని చెబుతున్నారు.

మంగళగిరి హైవే దగ్గర్లో 20 ఏళ్ల క్రితం వేసి ఓ లేఔట్‌లో స్థలాలు అమ్మేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నిస్తే.. ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. అలాంటిది రాజధానిలో ఎకరం 10 కోట్లకు అమ్ముతామంటే కొనేందుకు ఎవరు ముందుకు వస్తారన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా హైకోర్టు తీర్పు ప్రకారం రాజధాని నిర్మాణం జరిగి తీరాల్సిందే. కాని, భూములు అమ్మితే గాని రాజధాని నిర్మించలేమని చెబుతోంది జగన్ ప్రభుత్వం. అమరావతి భూములు అమ్మేందుకు ప్రభుత్వం జీవోలు ఇవ్వడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కట్టకుండా భూములు అమ్ముకోవడం ఏంటని మండిపడ్డారు.

అమరావతిని నిర్వీర్యం చేయడానికే చీకటి జీవోలు ఇచ్చారని ఆరోపించారు. అసలు రాజధాని రైతులకు ఇవ్వాల్సిన కౌలు, పేదలకు పెన్షన్లు కూడా అందడం లేదంటున్నారు. అసైన్డ్‌ రైతులు, నాన్‌ పూలింగ్‌ భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతుల సమస్యలను పట్టించుకోకుండా.. రాజధాని భూములు అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. ఏ సంస్థలకూ కేటాయించని భూముల అమ్మకానికి మాత్రమే తాము ఒప్పుకుంటామని, అది కూడా రాజధాని అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని రాజధాని రైతులు తెగేసి చెప్పారు. లేదంటే, కోర్టుకెళ్లి ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటామని హెచ్చరించారు. 

Tags:    

Similar News