అక్రమాస్తుల కేసులో విచారణ కోసం వైఎస్ జగన్ నాంపల్లి కోర్టు కు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్‌ను చూసేందుకు.. వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్‌పోర్టు, నాంపల్లి కోర్టు వద్దకు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు.. వైఎస్ జగన్, వైసీపీ శ్రేణుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్నేళ్లుగా వైఎస్ జగన్ రకరకాల కారణాలతో కోర్టుకు రాకుండా తప్పించుకున్నారని.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టుకు వెళ్తూ.. పెళ్లి పీటలు ఎక్కే వాళ్లలాగా బిల్డప్ ఇస్తూ వైఎస్ జగన్ కోర్టు బోనులోకి వెళ్లారంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్న వైఎస్ జగన్.. రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ న్యాయవ్యవస్థను కూడా అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్ హైదరాబాద్‌లో వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను హేళన చేసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇప్పటి వరకు కోర్టులకు హాజరుకాకుండా ఆయన డ్రామాలు ఆడారని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన తీరును మంత్రి తీవ్రంగా విమర్శించారు. ఇన్నాళ్లు కోర్టులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. 11 సీబీఐ ఛార్జీషీట్లు, 9 ఈడీ ఛార్జీషీట్లలో జగన్ రెడ్డి ఏ1గా ఉన్నారని గుర్తు చేశారు. సుమారు రూ.43 వేల కోట్ల అవినీతిని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటని అన్నారు. భారీ ఊరేగింపులు, ర్యాలీలతో కోర్టుకు ఎవరైనా హాజరవుతారా? అని ప్రశ్నించారు. అలా చేయడం న్యాయస్థానాలను అవమానించిడమేనని అన్నారు. 'రఫ్పా రఫ్పా' బ్యానర్లతో ర్యాలీ తీయడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.