AP: సొంత చెల్లె చీరపై విమర్శలా
జగన్ వైఖరిపై షర్మిల తీవ్ర ఆవేదన... విస్మయపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు;
పులివెందుల సభలో జగన్ తనపై చేసిన విమర్శలను ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగ సభలో..వేల మంది పురుషుల మధ్య సొంత చెల్లెలు ధరించిన దుస్తుల గురించి మాట్లాడిన సీఎం జగన్ దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ ను తిట్టిన వారు అవమానించినవారే ఇప్పుడు జగన్ కు బంధువులు అయ్యారని ధ్వజమెత్తారు. అవినాష్ రెడ్డి అమాయకుడు, చిన్నవాడని..., ఆయన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని జగన్ అనడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మరిచిపోయినట్లున్నారు... సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్ పసుపు రంగు ఉంటే తప్పేముంది. అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్లు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్‌రెడ్డికి అసలు సంస్కారం ఉందా?’’ అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు జిల్లా సంజీవయ్యనగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. ‘రాసిచ్చిన స్క్రిప్టును చదివేది జగన్‌మోహన్‌రెడ్డి. నేను వైఎస్సార్ బిడ్డను. నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు.. బెదిరించారు. సొంత చెల్లెలి గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడటం సభ్యతేనా?’ అని నిలదీశారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్‌మోహన్‌రెడ్డి. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులను తాకట్టు పెట్టారు. దిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డిని రక్షించడానికి దిల్లీ వెళ్తున్నారు. వైఎస్సార్‌కు జగన్ వారసుడు కాదు. మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా భాజపా నాయకులే చెబుతున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు.
తోడపుట్టిన చెల్లెలి పుట్టుకపై.. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా’ అని సీఎం జగన్ తీరుపై ఎక్స్ వేదికగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని మనిషి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని లోకేశ్ పేర్కొన్నారు.