బెంగళూరు సిటీజన్లకు ఈ– కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూపాయికే ఆటో రైడ్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. ‘బిగ్ బిలియన్ డేస్’సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క రూపాయికే ఆటో రైడ్ కావడంతో దీనికి భారీఎత్తున స్పందన లభిస్తోంది. కేవలం రూపాయి చెల్లించి ఆటో బుక్ చేసుకొని సిటీలో చక్కర్లు కొట్టేస్తున్నారు. పీక్ అవర్స్‌లో రద్దీని దృష్టిలోఉంచుకొని కంపెనీ పలు ముఖ్య ప్రాంతాల్లో స్టాల్స్ ను ఏర్పాటుచేసింది. ‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో రద్దీ సమయాల్లో రూపాయికే ఆటో రైడ్‌లను అందిస్తోంది’ అని ఆ కంపెనీ వెల్లడించింది. ఆటో రైడ్‌ల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమ ప్రచారానికి అద్భుత స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, అలాగే క్యాష్‌లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చామని తెలిపింది.