Car Prices Hike : కొత్త ఏడాదిలో కంపెనీల షాక్.. జనవరి నుంచి పెరగనున్న ధరలు..ఏ కారుపై ఎంత భారం?

Update: 2025-12-27 12:45 GMT

Car Prices Hike : కొత్త ఏడాదిలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. జనవరి 2026 నుంచి దేశంలోని పలు ప్రముఖ కార్ల కంపెనీలు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చులు, విదేశీ కరెన్సీ (రూపాయి విలువ తగ్గడం) వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సామాన్యులు వాడే బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు ఈ ధరల సెగ తగలనుంది. మరి ఏ బ్రాండ్లు ఎంత మేర ధరలు పెంచుతున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. మెర్సిడెస్-బెంజ్ బీఎమ్ డబ్ల్యూ : లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన అన్ని మోడళ్లపై 2% నుంచి 3% వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. యూరోతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల ఖర్చులు పెరిగాయని కంపెనీ తెలిపింది. అలాగే బీఎమ్ డబ్ల్యూ కూడా దాదాపు 3% మేర ధరలను పెంచనుంది. లగ్జరీ కార్ల ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే.

2. నిస్సాన్ ఇండియా : జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్‎తో సహా తన పోర్ట్‌ఫోలియోలోని కార్లపై 3% వరకు ధరలను పెంచనుంది. దీనివల్ల వేరియంట్‌ను బట్టి సుమారు రూ.17,000 నుంచి రూ.32,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.

3. ఎంజీ మోటార్, రెనో : ఎంజీ మోటార్ ఇండియా తన కామెట్ ఈవీ, హెక్టర్ వంటి మోడళ్లపై 2% వరకు ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే ఫ్రెంచ్ కంపెనీ రెనో కూడా తన క్విడ్, ట్రైబర్ మరియు కైగర్ మోడళ్లపై 2% వరకు ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

4. హోండా, ఇతర బ్రాండ్లు : హోండా కార్స్ ఇండియా తన అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లపై ధరలను పెంచనుంది. అయితే ఖచ్చితంగా ఎంత శాతం అనేది ఇంకా వెల్లడించలేదు (సుమారు 1-2% ఉండొచ్చు). బీవైడీ కూడా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరలను సవరించనుంది. మరోవైపు టాటా మోటార్స్ కూడా జనవరి లేదా మార్చి కల్లా ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

5. మారుతి సుజుకి , మహీంద్రా : అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, మార్కెట్ లీడర్లు మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా జనవరిలో ధరలను పెంచే ఆలోచనలో లేవని తెలుస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి పాత ధరలనే కొనసాగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News