Elon Musk Predicts: ఇక 10-20 ఏళ్లలో ప్రపంచంలో పేదరికమే ఉండదు.. ఎలాన్ మస్క్ సంచలన భవిష్యవాణి.

Update: 2025-11-21 07:30 GMT

Elon Musk Predicts: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు పోతాయని, అన్ని రంగాల్లోనూ మనుషులు పని కోల్పోతారని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వాదనకు వ్యతిరేకంగా టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఒక సంచలన భవిష్యవాణిని వినిపించారు. AI వల్ల ఉద్యోగ సమస్యలు మరింత తీరుతాయని, రాబోయే 10-20 ఏళ్లలో మనుషులకు అవసరమైన ప్రతిదాన్ని AI చూసుకునే స్థాయికి ఎదుగుతుందని ఆయన బలంగా వాదిస్తున్నారు.

ఎలాన్ మస్క్ ఇటీవల జరిగిన అమెరికన్ సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ఎన్విడా సీఈవో జెన్సెన్ హువాంగ్‌తో కలిసి ఒక ప్యానెల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా AI ఆవిష్కరణల వలన ప్రపంచంలో పేదరికం అనేదే ఉండదని ఆయన స్పష్టం చేశారు. "పేదరికాన్ని నిర్మూలించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అనేక NGOల ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. కానీ పేదరికం అనేది సామాజిక సమస్య కాదు. అది ఒక ఇంజనీరింగ్ సమస్య అని మస్క్ వివరించారు.

ఈ ఇంజనీరింగ్ సమస్యను AI, రోబోటిక్స్ ద్వారా పరిష్కరించవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. "ప్రతి ఒక్కరినీ ధనవంతులుగా మార్చే ఏకైక మూల మార్గం AI, రోబోటిక్స్ మాత్రమే" అని ఆయన గట్టిగా వాదించారు. ఎలాన్ మస్క్ ప్రకారం భవిష్యత్తులో AI, రోబోటిక్స్ టెక్నాలజీ మానవ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. రాబోయే రోజుల్లో AI, రోబోలే అన్ని ఉత్పాదక పనులను చేస్తాయి. మనుషులకు అవసరమైన ప్రతిదాన్ని అవి అందిస్తాయి. దీనివల్ల మనుషులు ఇకపై పని చేయాల్సిన అవసరం ఉండదు. వారికి టైమ్ పాస్ కోసం, కేవలం సరదాగా, క్రీడలు లేదా ఇతరత్రా పనులు చేసుకోవచ్చు. మనుషుల అవసరాలన్నీ సులభంగా తీరుతున్నప్పుడు డబ్బు అవసరం కూడా ఉండదని ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు.

Tags:    

Similar News