GOLD: పాక్‌పై భారత్ దాడి.. పెరిగిన బంగారం ధర
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. రూ.లక్షకు చేరిన బంగారం ధరలు;
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారం రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు మళ్ళీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. బంగారం ధర మళ్ళి ఒక లక్ష రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,000 వద్ద కొనసాగుతోంది. దీంతో పసిడి ప్రియులు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బంగారం ధరలు భారీగా పెరగడానికి ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఎయిర్‌ఫోర్స్ క్షిపణులతో మెరుపు దాడులు చేసింది. దీంతో నేడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కనిపించాయి కానీ, ఆ తర్వాత మళ్లీ కొనుగోలు కొనసాగి సూచీలు పాజిటివ్ అయ్యాయి. అయితే, బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా అమెరికాలో ఒక ట్రాయ్ ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర ఏకంగా 3400 డాలర్లకు పెరిగింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో పసిడి ధర ఏకంగా 100 డాలర్లు పెరిగింది.
స్థిరంగా పెఢరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు
ఓవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతుందని వార్తలు వచ్చాయి. దీంతో మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఫలితంగా బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్ళీ ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపానికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడల్లా బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. దీనికి తోడు డాలర్ కూడా బలహీనపడింది ఈ దెబ్బతో బంగారం ధరలు మళ్ళీ కొండెక్కి కూర్చున్నాయి. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చాలా కష్టమని చెప్పవచ్చు.
యుద్ధం సమయంలో ధరల్లో మార్పు
'1965, 1971, కార్గిల్ యుద్ధాల సమయంలో బంగారం ధరల్లో ఎక్కువ మార్పులు జరగలేదు. అయితే బంగారం ధరపై అత్యంత ప్రభావం.. ఒత్తిడులు, అమెరికా, చైనా సంబంధిత కార్యకలాపాల కారణంగా ఉంటుంది. దీంతో భవిష్యత్తులోనూ గ్లోబల్ అంశాలు మాత్రమే బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి.' అని యూనివెస్ట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ సత్సంగి వెల్లడించారు.