Alcohol : భారతీయులకు వైన్ కాదు.. విస్కీనే ఇష్టం.. ప్రపంచంలోని 20 దేశాలను దాటి టాప్‌లో భారత్!
Alcohol : ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉందని ఒక నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ఆల్కహాల్ రీసెర్చ్ సంస్థ IWSR విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోని 20 ప్రధాన మార్కెట్‌లలో మొత్తం ఆల్కహాల్ పానీయాల వినియోగంలో భారత్ వరుసగా మూడవ అర్ధ సంవత్సరంలో కూడా అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. కేవలం వైన్ మాత్రమే కాదు, భారతీయులు ప్రధానంగా విస్కీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలో మద్యపాన వినియోగం, దాని వృద్ధి రేటు, ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆల్కహాల్ మార్కెట్‌గా ఎలా మారబోతోందో వివరంగా తెలుసుకుందాం.
గ్లోబల్ ఆల్కహాల్ రీసెర్చ్ సంస్థ IWSR నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 20 ప్రధాన మార్కెట్‌లలో మొత్తం ఆల్కహాల్ పానీయాల వినియోగంలో అత్యధిక వృద్ధి రేటును వరుసగా మూడవ అర్ధ సంవత్సరంలోనూ భారత్ నమోదు చేసింది. జనవరి-జూన్ 2025 కాలంలో, భారతదేశంలో TBA వినియోగం సంవత్సరానికి 7 శాతం పెరిగి, 440 మిలియన్ 9-లీటర్ కేసులను దాటింది. IWSR ప్రమాణం ప్రకారం ఒక 9-లీటర్ కేస్ అంటే 12 స్టాండర్డ్ 750 మి.లీ బాటిళ్లకు సమానం.
స్పిరిట్ విభాగంలో భారతీయ విస్కీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించింది. ఇది 7 శాతం వృద్ధిని నమోదు చేసి, 130 మిలియన్ 9-లీటర్ కేసులకు చేరుకుంది. ఇదే కాలంలో వోడ్కా 10 శాతం, రమ్ 2 శాతం, జిన్, జెనెవర్ 3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మెరుగైన నాణ్యత, పెరుగుతున్న వినియోగదారుల బేస్, అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా భారతీయ విస్కీ స్పిరిట్ కేటగిరీకి ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా ఉందని IWSR ఆసియా-పసిఫిక్ రీసెర్చ్ హెడ్ సారా కాంప్‌బెల్ తెలిపారు.
భారత్ వృద్ధి రేటు ఆధారంగా, చైనా, అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికో, జర్మనీ, జపాన్, యూకే వంటి 20 ప్రపంచ మార్కెట్‌లను వెనక్కి నెట్టింది. IWSR దీర్ఘకాలిక అంచనాల ప్రకారం.. భారతదేశం వాల్యూమ్ పరంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆల్కహాల్ మార్కెట్‌గా ఎదగనుంది. ఇది 2027 నాటికి జపాన్‌ను, 2033 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రీమియం, అంతకంటే ఎక్కువ స్థాయి ఆల్కహాల్ కేటగిరీలు కూడా మొత్తం వృద్ధిని మించిపోయాయి. 2025 మొదటి అర్ధ సంవత్సరంలో వాల్యూమ్, విలువ రెండింటిలోనూ 8 శాతం వృద్ధి నమోదైంది. రెడీ-టు-డ్రింక్ పానీయాలు 11 శాతం, బీర్ 7 శాతం, స్పిరిట్స్ 6 శాతం వృద్ధిని నమోదు చేయగా, వైన్ వృద్ధి స్థిరంగా ఉంది.
కొన్ని ప్రత్యేక స్పిరిట్ కేటగిరీలలో కూడా భారతదేశంలో వేగవంతమైన వృద్ధి కనిపించింది. ఐరిష్ విస్కీలో 23 శాతం, అగావ్-ఆధారిత స్పిరిట్స్‌లో 19 శాతం వృద్ధి కనిపించింది. అయితే, అమెరికన్ విస్కీ వినియోగంలో 10 శాతం తగ్గుదల నమోదైంది. దేశీయ సింగిల్ మాల్ట్‌లతో పోలిస్తే, స్కాచ్ మాల్ట్ కాస్త మెరుగైన పనితీరును కనబరిచింది. ఫ్లేవర్డ్ వోడ్కాలో వృద్ధి ట్రెండ్ కొనసాగగా, బ్రాందీలో దక్షిణ రాష్ట్రాలలో ఫ్లేవర్డ్ రకాలు ఎక్కువయ్యాయి.