Insurance Complaints Report : ఇన్సూరెన్స్ కంపెనీల గుట్టురట్టు..అత్యధిక ఫిర్యాదులు ఈ సంస్థలపైనే.

Update: 2026-02-07 05:15 GMT

Insurance Complaints Report : కుటుంబానికి ఆర్థిక భద్రతనిస్తుందని నమ్మి మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటాం. కానీ తీరా క్లెయిమ్ సమయానికి వచ్చేసరికి అనేక తిరకాసులు ఎదురవుతున్నాయి. తప్పుడు హామీలతో పాలసీలు అమ్మడం, క్లెయిమ్ చెల్లింపులో జాప్యం చేయడం లేదా అసలు క్లెయిమ్‌నే రిజెక్ట్ చేయడం వంటి సమస్యలపై ఏటా వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఓంబుడ్స్‌మన్ విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదికలో ఏయే కంపెనీలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో సంచలన నిజాలు బయటపడ్డాయి.

కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఓంబుడ్స్‌మన్ గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీపై అత్యధికంగా 2,770 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ జాబితాలో భారతీయ జీవిత బీమా సంస్థ 1,951 ఫిర్యాదులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఎల్ఐసీకి ఉన్న కోట్లాది మంది పాలసీదారులతో పోలిస్తే ఈ ఫిర్యాదుల సంఖ్య తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (1,320), పీఎన్‌బీ మెట్‌లైఫ్ (1,060), బజాజ్ అలియాంజ్ లైఫ్ (998) కంపెనీలు కూడా ఫిర్యాదుల పరంగా టాప్ 5లో ఉన్నాయి.

పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల విషయంలోనూ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. మార్చి 31, 2025 నాటికి భారతీ యాక్సాలో 503 ఫిర్యాదులు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఎల్ఐసీలో 184, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 174 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ప్రైవేట్ సంస్థల్లో కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్‌పై అత్యంత తక్కువగా 555 ఫిర్యాదులు రావడం గమనార్హం. అలాగే ఎడెల్వైస్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కేవలం 87 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారానికి నోచుకోకుండా మిగిలి ఉన్నాయి.

ఇన్సూరెన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకూడదు. పాలసీ డాక్యుమెంట్లలో ఉండే నియమ నిబంధనలు ముఖ్యంగా క్లెయిమ్ రిజెక్షన్ క్లాజులను క్షుణ్ణంగా చదవాలి. క్లెయిమ్ చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీ క్లెయిమ్ సబబైన కారణం లేకుండా తిరస్కరణకు గురైతే, వెంటనే ఇన్సూరెన్స్ ఓంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. దీనివల్ల ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఫిర్యాదును పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News