Indian Airlines : విమానయాన సంస్థలకు భారీ షాక్.. రూ.10,500 కోట్ల నష్టం తప్పదా?

Update: 2025-11-19 05:00 GMT

Indian Airlines : దేశీయ విమానయాన పరిశ్రమకు సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఆందోళన కలిగిస్తోంది. రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. వచ్చే మార్చి 2026తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థల నికర నష్టం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ నష్టం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల వరకు చేరుకోవచ్చని అంచనా. ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి మందగించడం, విమానాల సరఫరాలో ఆలస్యం, ఖర్చులు పెరగడం ఈ భారీ నష్టాలకు ప్రధాన కారణాలుగా ఐసీఆర్‌ఏ పేర్కొంది.

నష్టాల అంచనా ఎంత?

ఐసీఆర్‌ఏ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం 2025లో భారతీయ విమానయాన రంగంలో సుమారు రూ.5,500 కోట్ల నష్టం ఉంటుందని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి ఇది పెరిగి రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల (95-105 బిలియన్ రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా.

ఈ నష్టం పెరగడానికి ప్రధాన కారణాలు ప్రయాణీకుల సంఖ్యలో నెమ్మదిగా వృద్ధి, కొత్త విమానాల డెలివరీ పెరగడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరగడం. అయితే ఈ అంచనా నష్టం గతంలో అంటే, ఆర్థిక సంవత్సరం 2022లో నమోదైన రూ.21,600 కోట్లు, ఆర్థిక సంవత్సరం 2023లో నమోదైన రూ.17,900 కోట్ల నష్టాల కంటే చాలా తక్కువగా ఉండటం కొంచెం ఊరటనిచ్చే విషయం.

2026 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 1.5 నుంచి 1.7 రెట్లు మధ్య ఉంటుందని ఏజెన్సీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 16.53 కోట్లుగా ఉండి, 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగిస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్త అంతరాయాలు, విమాన ప్రమాదాల తర్వాత ప్రయాణించడంలో కొంతమంది వెనుకడుగు వేయడం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యల కారణంగా వృద్ధి అంచనాలు తగ్గాయి.

అక్టోబర్ నెలలో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.43 కోట్లకు చేరుకుందని అంచనా. ఇది గత సంవత్సరం కంటే 4.5 శాతం ఎక్కువ. పరిశ్రమకు నష్టాలు పెరగడానికి మరొక ముఖ్య కారణం సరఫరా గొలుసు సమస్యలు, ఇంజిన్లలో లోపాల కారణంగా విమానాలు నిలిచిపోవడం. 2025 మార్చి 31 నాటికి, ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 133 విమానాలు నిలిచిపోయాయి. ఇది మొత్తం విమాన సముదాయంలో 15-17 శాతం.

ఈ ఆపరేషనల్ సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. నిలిచిపోయిన విమానాలకు అయ్యే ఖర్చు, వాటి స్థానంలో తాత్కాలికంగా తీసుకున్న విమానాలకు చెల్లించే అధిక లీజు అద్దెలు, ఇంధన సామర్థ్యం తగ్గడం వంటివి నష్టాలకు దోహదపడుతున్నాయి.

Tags:    

Similar News