Share Market Crash : షేర్ మార్కెట్‌లో భారీ పతనం.. 3 రోజుల్లో రూ. 6 లక్షల కోట్ల నష్టం.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు.

Update: 2025-11-08 06:00 GMT

Share Market Crash : అక్టోబర్‌లో 4 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసిన భారత షేర్ మార్కెట్ నవంబర్ మొదటి వారంలో పడిపోయింది. మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా నష్టాలు కొనసాగాయి. ఈ మూడు రోజుల్లో దాదాపు 19 గంటల ట్రేడింగ్ సెషన్‌లలో, సెన్సెక్స్ 750 పాయింట్ల కంటే ఎక్కువ, నిఫ్టీ 271 పాయింట్ల వరకు పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు రూ.6 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ అనూహ్య పతనానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ, ప్రతికూల అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌లు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగడం వల్ల వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈ మూడు ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ 762.21 పాయింట్లు పడిపోయి 83,216.28 వద్ద ముగిసింది (నవంబర్ 3న 83,978.49). నిఫ్టీ 271.05 పాయింట్ల నష్టంతో 25,492.30 వద్ద స్థిరపడింది (నవంబర్ 3న 25,763.35). కేవలం శుక్రవారం రోజునే సెన్సెక్స్ ఒకానొక దశలో 640 పాయింట్లు పడిపోయి 82,670.95 వద్దకు చేరి, చివరకు 94.73 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ పతనంతో గత మూడు రోజుల్లో పెట్టుబడిదారులు ఏకంగా రూ.6 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు.

అక్టోబర్‌లో జోరుగా ఉన్న మార్కెట్, నవంబర్‌లో ఒక్కసారిగా పడిపోవడానికి అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి.

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు : మార్కెట్ పతనానికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగడం. నవంబర్‌లో ఇప్పటివరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.6,214 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. జూలై నుండి ఇప్పటివరకు మొత్తం రూ.1.4 లక్షల కోట్లకు పైగా షేర్లను విక్రయించడం జరిగింది.

గ్లోబల్ మార్కెట్ బలహీనత: విదేశీ మార్కెట్లలో బలహీనమైన సెంటిమెంట్ భారత మార్కెట్‌పై ప్రభావం చూపింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గడం, వాల్‌స్ట్రీట్‌లో విలువలు పెరగడం, అలాగే ఆసియా మార్కెట్లలో (జపాన్ నిక్కీ, కొరియా కోస్పి 2% పతనం) భారీ అమ్మకాలు జరగడం దీనికి కారణం.

ఆర్థిక, వాణిజ్య అనిశ్చితి

దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని ఆర్థిక , వాణిజ్య పరిస్థితులు కూడా మార్కెట్ ఆందోళనను పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరం (FY26) మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8% వృద్ధి చెందినా, నామినల్ జీడీపీ వృద్ధి 9.6% నుండి 8.8% కి తగ్గడం ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనతను సూచిస్తుంది. అలాగే, భారత సర్వీస్ సెక్టార్ అక్టోబర్‌లో 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా మార్కెట్‌ను కలవరపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్పటికీ కొలిక్కి రాకపోవడం ఇన్వెస్టర్లలో అనిశ్చితిని పెంచుతోంది.

టెక్, కమోడిటీ కంపెనీల ప్రభావం

ఈ ఏడాది గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన ర్యాలీలో టెక్నాలజీ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. అయితే, భారత్‌లో ఆ స్థాయిలో టెక్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ (AI ఆధారిత), కమోడిటీ రంగాలే ప్రధానంగా వృద్ధిని నడిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారత్‌లో ఈ రంగాలలో బలమైన గ్లోబల్ కంపెనీలు లేకపోవడం కూడా భారతీయ షేర్ మార్కెట్ పనితీరును పరిమితం చేస్తోందని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News