Indias Economic Forecast : 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ - యూబీఎస్ అంచనా.
Indias Economic Forecast : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ప్రముఖ ఆర్థిక సంస్థ యూబీఎస్ గ్లోబల్ రీసెర్చ్ భారత ఆర్థిక వృద్ధిపై ఆశాజనకమైన అంచనాలను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం భారత్ తన వేగాన్ని కొనసాగిస్తూ 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరాల్లో దేశీయ జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, కీలక వడ్డీ రేట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై యూబీఎస్ నివేదికలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.
యూబీఎస్ గ్లోబల్ రీసెర్చ్, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచింది. యూబీఎస్ అంచనా ప్రకారం, భారతదేశం 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. అలాగే, 2026 నాటికి మూడవ అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌గా భారత్ అవతరించనుంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2027-28 నుంచి 2029-30 వరకు 6.5% చొప్పున స్థిరంగా ఉండవచ్చని యూబీఎస్ అంచనా వేసింది.
2026-27లో జీడీపీ వృద్ధి 6.4%, 2027-28లో 6.5%గా ఉండొచ్చని యూబీఎస్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని యూబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ విశ్లేషించారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన చర్యలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నాయని యూబీఎస్ అభిప్రాయపడింది.
పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు మంచి చేశాయి. అయితే, భూమి, పెట్టుబడి, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వంటి కీలక రంగాలలో మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. అప్పుడే కొత్త ఆర్థిక రంగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని యూబీఎస్ సూచించింది. ఒకవేళ అమెరికా తన 50% టారిఫ్ చర్యను భారతదేశంపై కొనసాగిస్తే, జీడీపీ వృద్ధి రేటులో 50 బేసిస్ పాయింట్ల (0.5%) వరకు తగ్గుదల సంభవించవచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల విషయంలో యూబీఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలతో పోలిస్తే కాస్త ఆశాజనకంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26), ద్రవ్యోల్బణం 2.4%గా ఉండొచ్చని యూబీఎస్ అంచనా వేసింది. అయితే, 2026-27లో ఇది 4.3%కి పెరగవచ్చని పేర్కొంది. ఆర్‌బీఐ ఇదే సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5%గా ఉంటుందని అంచనా వేసింది. దీని కంటే యూబీఎస్ అంచనా కొంచెం తక్కువగా ఉంది.
ద్రవ్య లోటు నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి భాగంలో 25 బేసిస్ పాయింట్ల (0.25%) మేర వడ్డీ రేటు కోత ఉండవచ్చని యూబీఎస్ అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని యూబీఎస్ రిపోర్ట్‌లో అంచనా వేశారు.