Inflation : పప్పు, ఉప్పు ధరలే కాదు..ఇకపై ఫోన్ రీఛార్జ్ రేటు పెరిగినా ద్రవ్యోల్బణం పెరిగినట్టే..కొత్త లెక్కలివే.
Inflation : ఫిబ్రవరి 12, 2026న భారత ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచీలో సరికొత్త మార్పులను అమల్లోకి తెచ్చింది. దాదాపు పుష్కర కాలం తర్వాత ద్రవ్యోల్బణం లెక్కించే పద్ధతిని మారుస్తూ, 2024ను బేస్ ఇయర్‌గా నిర్ణయించింది. ఈ మార్పు వల్ల కొన్ని రాష్ట్రాలకు ఊరట లభిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి 2012 నాటి అలవాట్లను ప్రాతిపదికగా తీసుకునేవారు. కానీ గత పదేళ్లలో భారతీయుల ఖర్చు చేసే విధానం మారింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 2024ను ఆధార సంవత్సరంగా తీసుకుంది.
* ఆహారం వాటా తగ్గింపు: గతంలో CPI బుట్టలో ఆహార పదార్థాల వాటా 45.86% ఉండేది, ఇప్పుడు అది 36.75 శాతానికి తగ్గింది.
* కొత్త ఐటమ్స్ చేరిక: మునుపటి 299 వస్తువుల స్థానంలో ఇప్పుడు 358 వస్తువులను లెక్కిస్తారు. ఇందులో విమాన ప్రయాణాలు, ఈ-కామర్స్ ధరలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా చేరాయి.
* హౌసింగ్ వాటా పెంపు: పట్టణ ప్రాంతాల్లో అద్దెలు పెరగడంతో, హౌసింగ్ కేటగిరీ బరువును 10% నుంచి 17.66 శాతానికి పెంచారు.
ఎవరు సేఫ్? ఎవరికి రిస్క్?
ఈ కొత్త లెక్కల వల్ల ఒక్కో రాష్ట్రంపై ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది:
* కేరళ, తెలంగాణ: ఈ రాష్ట్రాల్లో ప్రజలు ఆహారం కంటే సేవలు, విద్య, ఆరోగ్యం, విలాస వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. కొత్త సిరీస్‌లో సేవల వాటా పెరగడం వల్ల, దేశవ్యాప్తంగా ఆహార ధరలు తగ్గినా.. ఈ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కేరళలో బంగారం వినియోగం ఎక్కువ కాబట్టి, బంగారం ధరలు పెరిగితే ఆ రాష్ట్ర CPI భారీగా పెరుగుతుంది.
* బీహార్, జార్ఖండ్: ఈ రాష్ట్రాల్లో ఇంకా ప్రజల ఆదాయంలో సగానికి పైగా ఆహారం కోసమే ఖర్చు అవుతోంది. ఒకవేళ దేశంలో ఆహార ధరలు స్థిరంగా ఉంటే, ఈ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదవుతుంది.
* పట్టణ ప్రాంతాలు: అద్దెలు, హోటల్ ఖర్చులు, ఇంటర్నెట్ బిల్లుల వాటా పెరగడం వల్ల పట్టణాల్లో నివసించే వారి ద్రవ్యోల్బణం ఇప్పుడు మరింత కచ్చితంగా ప్రతిబింబిస్తుంది.