Sugar Production : చక్కెర మిల్లులలో బంపర్ రికార్డు.. తొలి రెండు నెలల్లోనే 4.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి.

Update: 2025-12-03 06:45 GMT

Sugar Production : భారతదేశంలో అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత చక్కెర సీజన్‌లో తొలి రెండు నెలల్లోనే పరిశ్రమ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశంలో చక్కెర ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 43 శాతం పెరిగింది. ఉత్పత్తి పెరగడం అంటే మార్కెట్‌లో చక్కెర కొరత ఉండదు, పైగా ప్రపంచానికి కూడా చక్కెర అందించే స్థితిలో మనం ఉంటాం.

అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత చక్కెర సీజన్‌లో దేశంలోని మిల్లులు అద్భుతమైన ఉత్పత్తిని నమోదు చేశాయి. ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. నవంబర్ నెలాఖరు వరకు దేశంలో మొత్తం 4.1 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరం ఇదే సమయానికి కేవలం 2.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉంది. అంటే ప్రస్తుత ఏడాదిలో 43 శాతం భారీ పెరుగుదల నమోదైంది.చెరకు నుంచి చక్కెర రికవరీ మెరుగుపడటం, మిల్లులలో క్రషింగ్ (గానుగ ఆడించడం) వేగంగా జరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.

దేశంలో అత్యధిక చక్కెర ఉత్పత్తికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కీలకంగా నిలిచాయి. దేశంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్ర, గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు కంటే ఎక్కువ ఉత్పత్తిని పెంచింది. ఇక్కడ ఉత్పత్తి 1.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్లులు కూడా బాగా పనిచేశాయి. ఇక్కడ ఉత్పత్తి 9 శాతం పెరిగి 1.4 మిలియన్ టన్నులకు చేరుకుంది.

మహారాష్ట్ర, యూపీలో ఉత్పత్తి ఊపందుకున్నప్పటికీ, దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి గత ఏడాది 8.12 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది 7.74 లక్షల టన్నులకు తగ్గింది. చెరకు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కారణంగా మిల్లుల్లో క్రషింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల ఉత్పత్తి తగ్గింది.

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ప్రకారం.. చెరకు నుంచి చక్కెరను తీసే రేటు (రికవరీ రేట్) గత ఏడాది 8.29 శాతం ఉండగా, ఈసారి అది 8.51 శాతానికి మెరుగుపడింది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరను మళ్లించడం తగ్గుతుందని భావిస్తున్న నేపథ్యంలో, మన దేశంలో అదనపు చక్కెర నిల్వలు మిగులుతాయని NFCSF పేర్కొంది. కాబట్టి, ప్రస్తుత సీజన్‌లో 10 లక్షల టన్నుల అదనపు చక్కెర ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మిల్లులు డిమాండ్ చేస్తున్నాయి.

దేశీయ మార్కెట్‌లో అధిక ఉత్పత్తి ఉన్నప్పటికీ, మిల్లు యజమానులకు ఎగుమతి చేయడం అంత సులభం కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు, భారతదేశంలోని దేశీయ మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఎగుమతి చేస్తే మిల్లులకు లాభం రాదు. అందువల్ల ISMA ప్రభుత్వం తమకు నష్టం కలగకుండా ఉండటానికి దేశీయ మార్కెట్‌లో చక్కెర కనీస అమ్మకపు ధరను పెంచాలని కోరుతోంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ ధర స్థిరంగా ఉందని, కానీ ఉత్పత్తి ఖర్చు మాత్రం పెరిగిందని మిల్లు యజమానులు వాదిస్తున్నారు.

Tags:    

Similar News