Philanthropist : నీతా అంబానీ కాదు.. ఈ ఏడాది రూ.204 కోట్లు దానం చేసింది ఎవరో తెలుసా?
Philanthropist : సాధారణంగా దేశంలో అత్యధికంగా దానధర్మాలు చేసే మహిళల్లో నీతా అంబానీ పేరు వినిపిస్తుంటుంది. అయితే, అడెల్‌గైవ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2025 ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన మహిళా వ్యాపారవేత్త నీతా అంబానీ కాదు! ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య, ప్రముఖ రచయిత్రి రోహిణి నిలేకని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ఆమె ఒక్కరే ఏకంగా 204 కోట్ల రూపాయలు దానం చేసి రికార్డు సృష్టించారు.
అడెల్‌గైవ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2025 ప్రకారం.. భారతదేశంలో అత్యధికంగా దానం చేసిన మహిళల్లో రోహిణి నిలేకని మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాదిలో ఆమె సామాజిక మార్పు కోసం ఏకంగా 204 కోట్ల రూపాయలు దానం చేశారు. గత ఐదేళ్లలో ఆమె చేసిన మొత్తం విరాళాల విలువ రూ.763 కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఆమెను దేశంలోని మిగతా మహిళా దాతల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది.
రోహిణి నిలేకని.. రోహిణి నిలేకని ఫిలాంత్రోపీస్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. అంతేకాక, లాభాపేక్ష లేని విద్యా వేదిక అయిన ఎక్‌స్టెప్ కు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె లింగ సమానత్వం, విద్య, వాతావరణ మార్పు, న్యాయం, పౌర సమాజాన్ని బలోపేతం చేయడం వంటి రంగాలకు తన సంపదను వినియోగించారు. రోహిణి నిలేకని దాతృత్వంలోనే కాక, రచయిత్రిగా కూడా గుర్తింపు పొందారు.
ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రోహిణి, ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ నుంచి ఫ్రెంచ్ సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాంబే మ్యాగజైన్, సండే మ్యాగజైన్ లలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆమె తన జర్నలిజం అనుభవాలను ఆధారంగా చేసుకుని అనేక పుస్తకాలు రాశారు. ఆమె రాసిన తొలి పుస్తకం స్టిల్‌బార్న్ ఒక మెడికల్ థ్రిల్లర్‌గా ప్రచురితమై పాఠకుల ఆదరణ పొందింది. దాతృత్వంలోనే కాక, ఆమె రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. రోహిణి నిలేకని రచయిత్రిగా తన ప్రస్థానంలో అనేక రచనలు చేశారు. అన్‌కామన్ గ్రౌండ్ ఇది ఆమె రిపోర్టింగ్ అనుభవాల ఆధారంగా రాసిన పుస్తకం. ది హంగ్రీ లిటిల్ స్కై మాన్‌స్టర్.. ఇది ఆమె రాసిన పిల్లల పుస్తకం.