IndiGo Crisis : ఇండిగోలో విమాన విధ్వంసం..550కి పైగా విమానాలు రద్దు..ఫిబ్రవరి 2026 వరకు కష్టాలు తప్పవా?
IndiGo Crisis : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత మూడు రోజులుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ కారణంగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. వేలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ (172), ముంబై (118), బెంగళూరు (100) వంటి ప్రధాన నగరాల నుంచే అత్యధిక విమానాలు రద్దయ్యాయి. సాధారణంగా సమయపాలనకు పేరుగాంచిన ఇండిగోలో, ఈ రద్దుల సంఖ్య రోజుకు 170-200కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా దీని సమయపాలనా రేటు (On-time Performance) డిసెంబర్ 2న 35 శాతం ఉండగా, బుధవారం నాటికి కేవలం 19.7 శాతంకి పడిపోయింది.
సంక్షోభానికి కారణాలు, డీజీసీఏ సమీక్ష
ఇండిగో విమానాల నిర్వహణలో ఏర్పడిన ఈ భారీ అంతరాయంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులు కంపెనీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండిగో అందించిన వివరణ ప్రకారం.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల రెండవ దశ అమలులో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు , ప్రణాళికా లోపాల కారణంగానే ఈ సమస్య వచ్చిందని తెలిపారు. ఊహించిన దాని కంటే సిబ్బంది అవసరాలు పెరగడం వల్ల విమానాల నిర్వహణలో అంతరాయం ఏర్పడింది. డీజీసీఏ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇండిగో నుంచి పూర్తి ప్రణాళికను కోరింది.
సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుంది?
ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందోనన్న ప్రయాణికుల ప్రశ్నకు ఇండిగో ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. కంపెనీ ప్రస్తుతం ఉన్న అంతరాయాలను సరిచేయడానికి డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్యను మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, పూర్తిగా స్థిరమైన విమాన కార్యకలాపాలు పునరుద్ధరించడానికి ఫిబ్రవరి 10, 2026 వరకు సమయం పడుతుందని ఇండిగో డీజీసీఏకు తెలియజేసింది. విమాన సిబ్బంది నియామకం, శిక్షణ, రోస్టర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్ర ప్రణాళికను సమర్పించాలని డీజీసీఏ ఇండిగోను ఆదేశించింది.