NPS : ఎన్పీఎస్ రూల్స్ మారాయ్.. కార్పొరేట్ స్కీమ్ రెండు ముక్కలు.. కొత్త చార్జీల లిస్ట్ ఇదే.
NPS : నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే వారికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక వార్త చెప్పింది. ఎన్పీఎస్ కార్పొరేట్ స్కీమ్‌లో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వాస్తవానికి ఈ మార్పులు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వచ్చినప్పటికీ, దీనిపై స్పష్టతనిస్తూ మార్చి 10న పీఎఫ్ఆర్‌డీఏ తాజా సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇకపై ఎన్పీఎస్ కార్పొరేట్ మోడల్ రెండు విభాగాలుగా విడిపోనుంది.
రెండుగా మారిన కార్పొరేట్ స్కీమ్
ఇప్పటివరకు కార్పొరేట్ సెక్టార్ కింద ఉన్న అన్ని సంస్థలను ఒకేలా చూసేవారు. కానీ ఇప్పుడు వీటిని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర చట్టబద్ధ సంస్థలు అని రెండుగా వర్గీకరించారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉండే ప్రభుత్వ కంపెనీలు, స్టాట్యూటరీ బాడీలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (CPSEs), రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (SPSEs) అన్నీ ఇకపై ప్రభుత్వ సంస్థల కేటగిరీలోకి వస్తాయి. ఈ మార్పు వల్ల ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ నిర్వహణ మరింత సులభతరం కానుంది.
చార్జీల విషయంలో భారీ మార్పులు
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఒక వెసులుబాటు లభించింది. వీరు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ద్వారా ట్యాగ్ చేయబడరు. అంటే వీరు PoPకి చెల్లించాల్సిన సర్వీస్ చార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వేతర సంస్థల (ప్రైవేట్ కంపెనీల) ఉద్యోగులకు మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల పై ఏడాదికి 0.20% చార్జీని ఖరారు చేశారు. ఈ చార్జీని ప్రతి త్రైమాసికంలో ఎన్ఏవీ ద్వారా సర్దుబాటు చేసి పీఓపీలకు చెల్లిస్తారు. అయితే లావాదేవీలు జరగని ఖాతాలపై ఈ చార్జీలు పడవు.
సాధారణ పౌరులకు కొత్త ధరలు
కేవలం కార్పొరేట్ ఉద్యోగులకే కాకుండా, ఆల్ సిటిజన్ మోడల్, ఎన్పీఎస్ వాత్సల్య, ఎన్పీఎస్ లైట్ ఖాతాదారులకు కూడా కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా ఎన్పీఎస్ ఖాతా తెరిచే వారు ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.200 చెల్లించాలి. అయితే డిజిటల్ పద్ధతిలో ఖాతా తెరిస్తే ఈ చార్జీ రూ.100 మాత్రమే ఉంటుంది. ఆల్ సిటిజన్ మోడల్‌లో చేరేవారు కనీసం రూ.250 తో ఖాతా ప్రారంభించి, ఆ తర్వాత ఎప్పుడైనా కనిష్టంగా రూ.10 చొప్పున కూడా కాంట్రిబ్యూషన్ చేయవచ్చు.
ఈ-ఎన్పీఎస్ వాడే వారికి బంపర్ ఆఫర్
ఎవరైతే ఆన్‌లైన్ ద్వారా అంటే ఈ-ఎన్పీఎస్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించి నేరుగా ఖాతా తెరిచి పెట్టుబడులు పెడతారో, వారికి పీఓపీ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల ఖర్చు తగ్గి దీర్ఘకాలంలో పెన్షన్ ఫండ్ ఎక్కువగా పోగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షన్ ఇన్వెస్టర్లు వీలైనంత వరకు డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా తమ ఆదాను పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.