Tax Hike Alert : భారీగా పెరుగనున్న గుట్కా, సిగరెట్, పాన్ మసాలాల ధరలు.. పార్లమెంట్‌లో కొత్త బిల్లు.
Tax Hike Alert : గుట్కా, సిగరెట్లు, పాన్ మసాలా వంటి సిన్ గూడ్స్ ధరలు త్వరలో పెరగనున్నాయి. జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కొత్త పన్నును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఈ రోజు (సోమవారం) లోక్‌సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిహార సెస్ గడువు ముగిసిన తర్వాత కూడా, ఈ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గకుండా చూసేందుకు ఈ కొత్త బిల్లులను తీసుకొస్తున్నారు. దీని లక్ష్యం ఏమిటంటే జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం అయ్యే ఖర్చులను సమకూర్చుకోవడంతో పాటు, ఈ వ్యసనకారక ఉత్పత్తుల ధరలు పెరిగేలా చేయడం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో రెండు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు: అవి సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025, హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025. ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పొగాకు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పరిహార సెస్ గడువు ముగిసిన తర్వాత కూడా, వాటిపై పన్ను ప్రభావం తగ్గకుండా చూసుకోవడం. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 ద్వారా సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ విధించి, జీఎస్టీ పరిహార సెస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక, హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025 ద్వారా పాన్ మసాలాపై ఉన్న సెస్ స్థానంలో కొత్త సెస్ విధించి, దాని ద్వారా వచ్చే నిధులను జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి సంబంధించిన ఖర్చుల కోసం సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం పొగాకు, పాన్ మసాలాపై 28% జీఎస్టీతో పాటు అదనంగా వేర్వేరు రేట్లతో పరిహార సెస్ వర్తిస్తోంది. ఈ పరిహార సెస్సును మొదట 2017లో జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని పూడ్చడానికి ఐదేళ్ల కాలానికి విధించారు. తరువాత కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు అయిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు, ఈ సెస్ గడువును మార్చి 31, 2026 వరకు పొడిగించారు. ఈ రుణం తిరిగి చెల్లింపు ఈ డిసెంబర్ నాటికి పూర్తి కానుండటంతో పరిహార సెస్ రద్దు కానుంది. జీఎస్టీ కౌన్సిల్ గతంలోనే, ఈ రుణాల చెల్లింపు పూర్తయ్యే వరకు పొగాకు, పాన్ మసాలాపై సెస్ కొనసాగించాలని నిర్ణయించింది.
అయితే జీఎస్టీ పరిహార సెస్ రద్దు అయినప్పటికీ ఈ రెండు కొత్త బిల్లులు అమలులోకి వస్తే, పొగాకు, పాన్ మసాలా వంటి వ్యసనకారక ఉత్పత్తులపై పన్ను భారం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త సెస్‌ల ద్వారా సేకరించిన నిధులను ప్రభుత్వం జాతీయ భద్రత, ప్రజారోగ్యం వంటి కీలక రంగాల కోసం వినియోగించనుంది.