Stock Market Scam : 4 ఏళ్లు నమ్మించి, షేర్ మార్కెట్ పేరుతో వృద్ధుడికి రూ.35కోట్ల కుచ్చుటోపీ పెట్టిన బ్రోకరేజ్ సంస్థ.

Update: 2025-11-28 10:15 GMT

Stock Market Scam : డబ్బు ఉన్నవారిని మోసం చేయడానికి మోసగాళ్లు ఎప్పుడూ కాచుకుని ఉంటారు. తాజాగా ముంబైకి చెందిన ఓ 72 ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి షాక్ తగిలింది. షేర్ మార్కెట్ గురించి కనీస అవగాహన లేని ఆయన్ను, ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉద్యోగులు ఏకంగా నాలుగు సంవత్సరాలు నమ్మించి, చివరికి రూ.35 కోట్లు పంగనామం పెట్టిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మోసానికి గురైన ఆ వృద్ధుడు, ఆయన భార్య ముంబైలో క్యాన్సర్ రోగులకు అతి తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ సేవలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఆ పెద్దాయన భరత్ హరక్‌చంద్ షా ఎలా మోసపోయారు? ఈ భారీ మోసం ఎలా జరిగింది? అనే వివరాలు తెలుసుకుందాం.

ముంబైకి చెందిన భరత్ హరక్‌చంద్ షా, ఆయన భార్య ముంబైలోని పరేల్‌లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకే గెస్ట్ హౌస్ నిర్వహిస్తున్నారు. భరత్ షాకు 1984లో చనిపోయిన తన తండ్రి నుంచి కోట్ల విలువైన షేర్లు వారసత్వంగా వచ్చాయి. అయితే ఆయనకు స్టాక్ మార్కెట్ గురించి కనీస అవగాహన లేకపోవడంతో, ఆ షేర్లను ఎప్పుడూ అమ్మలేదు, కొనలేదు. ఈ షేర్లు అన్నీ అలాగే ఉండిపోయాయి.

2020లో ఒక స్నేహితుడి సలహా మేరకు, భరత్ షా, ఆయన భార్య గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అనే బ్రోకరేజ్ సంస్థలో డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. తన తండ్రి నుంచి వచ్చిన షేర్లను ఈ కొత్త ఖాతాలకు బదిలీ చేయడంతోనే ఈ మోసానికి పునాది పడింది. ఖాతా తెరిచిన తర్వాత, బ్రోకరేజ్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. ట్రేడింగ్ కోసం కొత్త పెట్టుబడి అవసరం లేదని, ఉన్న షేర్లను పెట్టి ట్రేడింగ్ చేయవచ్చని ఆ దంపతులను నమ్మించారు. కంపెనీ వెంటనే అక్షయ్ బారియా, కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులను భరత్ షా పోర్ట్‌ఫోలియోను నిర్వహించడానికి పర్సనల్ గైడ్‌లుగా నియమించింది.

ఈ ఇద్దరు యువకులు నిత్యం షా దంపతులకు ఫోన్ చేసి, ట్రేడింగ్ ఆర్డర్లు ఎలా ప్లేస్ చేయాలో సూచించేవారు. తరచుగా ఇంటికి కూడా వచ్చి కలిసేవారు. ఈ క్రమంలోనే వారు ఆ దంపతుల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నారు. ఆ యువకులు అడిగినప్పుడల్లా వారు OTP, SMS, ఈ-మెయిల్ వంటి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడంతో, ఆ ఇద్దరు యువకులు షా దంపతుల డీమ్యాట్ ఖాతాలపై కంట్రోల్ సాధించారు.

దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ మోసం కొనసాగింది. ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తున్నట్లు కనిపించే బొగస్ స్టేట్‌మెంట్‌లను కంపెనీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఆ దంపతులకు అందిస్తూ వచ్చారు. దీంతో భరత్ షాకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే 2024 జూలైలో భరత్ షాకు పెద్ద షాక్ తగిలింది. గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగం నుంచి ఆయనకు కాల్ వచ్చింది. షా ఖాతాలో రూ.35 కోట్లు చెల్లించాల్సిన బకాయి ఉందని, వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.

షాక్ అయిన భరత్ షా వెంటనే కంపెనీని స్వయంగా సందర్శించి ఆరా తీశారు. అప్పుడు తన భార్య ఖాతా ద్వారా భారీ స్థాయిలో అక్రమ ట్రేడింగ్ జరిగిందని, దానివల్లనే ఇంత పెద్ద నష్టం వచ్చిందని తెలుసుకున్నారు. ఈ నష్టాన్ని భరించడానికి భరత్ షా మిగిలిన కొన్ని షేర్లను కూడా అమ్మాల్సి వచ్చింది. వెంటనే ఆయన తన మిగిలిన షేర్లను వేరే బ్రోకరేజ్ కంపెనీకి బదిలీ చేశారు.

గ్లోబ్ క్యాపిటల్ వెబ్‌సైట్ నుంచి తన ఖాతాల ట్రేడింగ్ స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసుకుని చూసినప్పుడు, గతంలో తనకు ఇచ్చినవన్నీ నకిలీ స్టేట్‌మెంట్‌లని షాకు అర్థమైంది. దీంతో ఆయన ముంబైలోని వనరాయ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.

Tags:    

Similar News