Money Tips : చేతిలో డబ్బు నిలవడం లేదా? ఖర్చు పెట్టే ముందు ఇలా చేయండి.

Update: 2025-11-11 08:30 GMT

Money Tips : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం. నెలకు రూ.50,000 కంటే ఎక్కువ జీతం వచ్చినా, అధిక ఆదాయం ఉన్నా, నెల చివరకు వచ్చేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చాలా మంది వాపోతుంటారు. అయితే, ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం డబ్బు కాదని, మరొకటి ఉందని నిపుణులు చెబుతున్నారు.. సోషల్ మీడియా పోస్ట్‌లో, మనుషుల నుంచి మొదట చేజారిపోయేది డబ్బు కాదు మానసిక శక్తి అని, ఇదే అనవసర ఖర్చులకు దారి తీస్తుందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలు ఏంటో చూద్దాం.

చాలా మంది ప్రజలు తమ సమస్య కేవలం డబ్బుకు సంబంధించిందిగా భావిస్తారు, కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం మానసిక శక్తి క్షీణత అని నిపుణులు స్పష్టం చేశారు. చాలా మందికి డబ్బు సమస్య ఉందనిపిస్తుంది. వాస్తవానికి, అది మానసిక శక్తి సమస్య. మొదట ఖాళీ అయ్యేది డబ్బు కాదు, మన మనస్సులోని శక్తి అని చెబుతున్నారు.

దీన్నిబట్టి చూస్తే, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కంటే, మానసికంగా బలహీనంగా ఉండటమే అనవసర ఖర్చులకు దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు తమ స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి ఇంపల్సివ్ స్పెండింగ్ అనే అలవాటుకు లోనవుతున్నారు.

ఆన్‌లైన్‌లో రీల్స్‌కు బానిసలైనట్లే, చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడుతున్నారు. ఆహారం కావాలంటే జొమాటో/స్విగ్గీ, ఎక్కడికైనా వెళ్లాలంటే ఓలా/ఊబర్ లేదా ఇంటికి సామాన్లు కావాలంటే బ్లింకిట్/జెప్టో వంటి యాప్‌లను తెరిచి, తమకు అవసరం లేకపోయినా ఆర్డర్లు ఇస్తున్నారు. పని చేసి అలసిపోయినప్పుడు, ప్రజలు తమ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఈ ఇంపల్సివ్ ఖర్చులకు అలవాటు పడతారు. ఇది క్రమశిక్షణ లేకపోవడం కంటే, మానసిక సంకల్ప శక్తి తగ్గడం వల్ల జరుగుతుందని నిపుణులు విశ్లేషించారు.

అనవసర ఖర్చుల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఒక వినూత్నమైన ట్రాకింగ్ పద్ధతిని సూచించారు. మీరు రోజువారీగా చేసే ప్రతి ఖర్చును రాసుకునే అలవాటు ఉంటే, దానితో పాటు ఆ ఖర్చు చేస్తున్న సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? అనే దాన్ని కూడా నమోదు చేయండి. ఇలా చేయడం ద్వారా, మీ అనవసర ఖర్చులకు ప్రధానంగా ఏ భావోద్వేగం (ఉదా: విచారం, ఒత్తిడి, కోపం) కారణమవుతుందో సులభంగా గుర్తించవచ్చు.

భావోద్వేగంతో ఖర్చు చేయడాన్ని నివారించడానికి ఒక సులభమైన వ్యూహాన్ని చెప్పారు. ఏదైనా పెద్ద కొనుగోలు చేయాలని అనిపించినప్పుడు, ఆ భావోద్వేగం లేదా తొందరపాటులో ఖర్చు చేయకుండా ఉండటానికి, 10 నుంచి 15 నిమిషాలు మౌనంగా ఉండండి. ఈ సమయంలో ఫోన్ లేదా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండండి. ఇలా చేయడం వల్ల మీ ఆలోచనలు శాంతంగా ఉండి, ఆందోళన తగ్గుతుంది. తద్వారా మీరు సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.

Tags:    

Similar News