నేచురల్ స్టార్ నాని ( Nani ) తన కెరీర్ ప్రారంభంలోనే 'క్లాస్ హీరో' ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చాలా కాలంగా మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్న ఆయన గతేడాది 'దసరా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఆ దిశలో ఒక ముందడుగు వేశారు. ఈ సినిమాలో ఊర మాస్ లుక్ తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
ప్రస్తుతం వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' (Saripoda Sanivaram) అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. అహింసావాది అయిన ఒక మామూలు మిడిల్ క్లాస్ యువకుడు.. ప్రతీ శనివారం మోస్ట్ వైలెంట్ గా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
తదుపరిగా 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో మరో ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు నానీ . సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. 'లీడర్ గా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు' అంటూ నాని దీంట్లో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.
వీటితో పాటు డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ ఫ్రాంచైజీలో నాని నటించనున్నాడు. 'హిట్ 3: థర్డ్ కేస్' అనే పేరుతో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాని స్పెషల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు.
అలాగే.. సుజిత్ దర్శకత్వంలోనూ నాని ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఒక వైలెంట్ మ్యాన్ కొన్ని పరిస్థితుల కారణంగా నాన్ వైలెంట్ గా మారినప్పుడు అతని ప్రపంచం ఎలా తలక్రిందులు అయిందనే యూనిక్ స్టోరీ లైన్ తో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న నాని.. రాబోయే సినిమాలతో మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం, నాని రేంజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ హీరోగా మారే ప్రయత్నంలో ఉన్నప్పటికీ, నాని తన నటనలో వైవిధ్యం కొనసాగిస్తున్నారు.
'సరిపోదా శనివారం' వంటి యాక్షన్ డ్రామాలతో పాటు, 'హిట్ 3' వంటి క్రైమ్ థ్రిల్లర్స్ మరియు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వంటి విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
నాని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. 'దసరా' సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, ఇది ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమాలు నానీకి యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చిపెడతాయో లేదో చూడాలి.