Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై నెలకొన్న ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకునేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ సినిమా కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.