బంగాళాఖాతంలో అల్పపీడనం..రాగల 24 గంటల్లో..
Rain Alerts: ఉత్తర బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.;
Rain Alerts
Rain Alerts: తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. మరోవైపు తాజాగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవి రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో పశ్చిమ దిశలోని పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడన ప్రభావం కోస్తాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కదలికలో మందగమనం కొనసాగనున్నందున ఎండ తీవ్రత పెరగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, గురువారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.