Tollywood Meeting: జగన్‌తో టాలీవుడ్ స్టార్ల సమావేశం.. సినిమా టికెట్ ధరల విషయంలో..

Tollywood Meeting: టికెట్ ధరల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కోరుకున్నట్టే వారం పది రోజుల్లో సానుకూల నిర్ణయం రాబోతోంది.;

Update: 2022-02-10 09:06 GMT

Tollywood Meeting: ఆరేడు నెలల వివాదం కొలిక్కి వచ్చింది. టికెట్ ధరల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కోరుకున్నట్టే వారం పది రోజుల్లో సానుకూల నిర్ణయం రాబోతోంది. ఏపీలోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని టాలీవుడ్‌ పెద్దలు హామీ ఇవ్వడం ఈ భేటీలో తీసుకున్న ఇంకో పెద్ద నిర్ణయం. ఇవాళ ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లి వెళ్లిన చిరంజీవి బృందం.. CMతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది.

సీఎం జగన్‌తో భేటీతో సినిమా ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందన్నారు చిరంజీవి. త్వరలోనే తాము ప్రస్తావించిన అంశాలపై సానుకూల నిర్ణయంతో జీవో వస్తుందని అన్నారు. టికెట్ ధరల విషయంలో కొద్ది నెలలుగా ఉన్న అనిశ్చితికి ఈ భేటీతో తెరపడిందన్నారు. తక్కువ రేటుకు వినోదం ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని, అదే సమయంలో తమ సమస్యల్ని కూడా సానుకూలంగా విన్నారని అన్నారు.

సీఎం ఆకాంక్షించినట్టు వైజాగ్‌లోనూ సినిమా పరిశ్రమ అభివృద్దికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, తెలంగాణతోపాటు ఏపీలోనూ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. 5వ ఆటకు అనుమతి ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు చిరంజీవి. సినీ పరిశ్రమపై సీఎంకు పూర్తి అవగాహన ఉందన్న రాజమౌళి.. తమ విజప్తులన్నీ కూలంకుషంగా విన్నారని అన్నారు. చిరంజీవి చొరవతోనే అన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. భేటీతో.. 7 నెలల అనిశ్చితికి తెరపడిందన్నారు.

అటు, ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపడం పట్ల మహేష్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. వారం పదిరోజుల్లో అంతా శుభవార్త వింటామన్నారు. అటు, ప్రభాస్‌ కూడా చిరంజీవి చొరవతోనే ఈ టికెట్ల వివాదం కొలిక్కి వచ్చిందంటూ CMకి, చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు. చర్చలు పలప్రదం అవడం తనకు చాలా హ్యాపీగా ఉందన్నారు ఆర్‌.నారాయణమూర్తి. చిన్న సినిమాలకు మేలు చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావడం, 5వ షోకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News