వివాదాస్పద జాతకాల రాయుడు వేణు స్వామి మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం అతనికి పరిపాటి అయిపోయింది. గతంలో నాగ చైతన్య, శోభిత విడిపోతారు అంటూ చెప్పిన మాటల విషయంలో తెలుగు ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కేస్ పెట్టింది. దీనిపై రకరకాల కమీషన్స్ ముందు హాజరై తప్పై పోయింది అంటూ క్షమాపణలు వేడుకున్నాడు. అలాగే టివి5 జర్నలిస్ట్ మూర్తిపైనా తప్పుడు కూతలు కూశాడు. ఈ సారి వీటికి మించిన దారుణమైన వ్యాఖ్యలు చేయడం సినిమా పరిశ్రమలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా అభిమానులంతా వేణు ఎక్కడ కనిపిస్తాడా అని ఎదురుచూసేలా ఉన్నాయి.
అతను చేసిన మాటలను ఆడియో రూపంలో టివి5 జర్నలిస్ట్ మూర్తి తన షోలో బయటపెట్టాడు. ఇవి వింటే రక్తం మరిగిపోతుందంటే. ఈ యేడాది ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంతలు చనిపోతారట. పైగా వీరిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్లూ ఉన్నారని చెబుతున్నాడు. దీని పూర్తి ఆడియో ఇంకా బయటకు రావాల్సి ఉంది. నిజానికి వేరే వ్యక్తుల పర్మిషన్ లేకుండా, వాళ్లు అడగకుండా వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. జాతకాలు చెప్పే వాళ్లకు అస్సలు లేదు. ఒకవేళ వీళ్లే అడిగినా.. ఇలా బాధపెట్టే అంశాలను చెప్పకూడదు అనే నియమాలూ ఉన్నాయి. వీటిని దాటి వేణు స్వామి చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలు ఈ సారి అతని జాతకాన్ని మార్చేలా ఉన్నాయి. లేదంటే అతను మరింతగా బరితెగించి మాట్లాడతాడు. ఇలాంటి వారికి సరైన బుద్ధి చెప్పకపోతే పబ్లిక్ ఫిగర్స్ ను గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు.