విశాల్, అంజలి, వరలక్ష్మీ నటించిన 'మదగజరాజా' సంక్రాంతికి తమిళంలో విడుదలై విజయం సాధించింది. సుందర్ సి. దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకోసం ఈనెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. నటి అంజలి మాట్లాడుతూ "ఇది మంచి కమర్షియల్ సినిమా. విశాల్ ఈ సినిమా కోసం చాలా శ్రమించారు. తమిళ్ హిట్ అయినట్టుగానే తెలుగులో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, సంగీతం, దర్శకత్వ ప్రతిభ విజయాన్ని తెచ్చిపెడుతాయని" అన్నారు. వరలక్ష్మీ మాట్లాడుతూ “ఇది హీరోయిన్గా నా తొలి కమర్షియల్ చిత్రం. అంజని నుండి చాలా నేర్చుకున్నాను. ఇందులో నేను ఆధునిక యువతిగా కనిపిస్తాను” అని చెప్పారు. నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ "తమిళంలో పెద్ద విజయం సాధించింది. ఇక్కడ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.