నాలుగేండ్ల కిందటి వరకు పూజా హెగ్డే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. బాలీవుడ్ కు సైతం ఎంట్రీ ఇచ్చి సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సరసన యాక్ట్ చేసింది. అయితే, రెండు మూడేళ్లుగా ఆమె కెరీర్ ఢీలా పడింది. వరుస ఫ్లాప్ లు పడటంతో ఆఫర్లు లేక హాలీడే ట్రిప్ లను ఎంజాయ్ చేస్తోంది. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే.. ముంబయిలో పుట్టి పెరిగింది. అక్కడే చదువుకుంది. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో 2009, 2010లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది. 2012లో కోలీవుడ్ లో జీవా హీరోగా వచ్చిన ‘మూగామూడి’(తెలుగులో ‘మాస్క్’) మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పూజా హెగ్డేను టాలీవుడ్ అక్కున చేర్చుకుంది. 2014లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’, అదే ఏడాది వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ముకుంద’లో పూజా యాక్ట్ చేసింది.
ఈ రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు దక్కలేదు. 2016లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బీ టౌన్ కు ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. అయితే, ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టిన పూజా హెగ్డే.. 2017లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టింది. రంగ స్థలం సినిమాలో ‘జిగేల్ రాణి’ స్పెషల్ సాంగ్ లో కనిపించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేశ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. 2020 సంక్రాంతికి రిలీజైన ‘అల వైకుంఠపురం’ సినిమా పూజా హెగ్డే కెరీర్ కు బిగ్ టర్నింగ్ పాయింట్. ఆ సినిమాతో ఒక్కసారిగా సౌత్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. అయితే, ఆ మూవీ తర్వాత మళ్లీ ఆమెను వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి.
రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్యతో పాటు హిందీలో ఆమె యాక్ట్ చేసిన సర్కస్, కిసీ కా జాన్.. కిసీ కా బాయ్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో పూజా కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది పూజా హెగ్డే సినిమా ఒక్కటీ కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పూజా చేతిలో రెండు ప్రాజెక్ట్ లున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో తెరకెక్కే సినిమాలో, బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న ‘దేవా’లో ఆమె యాక్ట్ చేస్తోంది. దీంతో పాటు రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న కాంచన4లోనూ పూజా చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు హిట్ అయితే మళ్లీ పూజా హెగ్డే కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కినట్లే.