ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమ ఇలవేల్పు పూజ గురించి పూజారితో మాట్లాడి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లి కళతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు విషాదంలో మునిగిపోయింది.
పోలీసుల వివరాల ప్రకారం...ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరు గ్రామానికి చెందిన దామినేని శ్రీనివాసరావు (55), రజనీకుమారి (50) దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇదివరకే పెళ్లి జరిపించారు. ఇటీవల కుమారుడికి పెళ్లి నిశ్చయం కావడంతో దంపతులిద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహానికి ముందు ఇంట్లో ఆచారంగా నిర్వహించే ఉప్పలమ్మ తల్లి పూజకు సంబంధించిన విషయాలను చర్చించడానికి వారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న పూజారి దగ్గరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేగంగా వచ్చిన కోళ్ల వ్యాను వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కొద్ది రోజుల్లోనే పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్థులు ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుడికి పెళ్లి చేసే భాగ్యం దక్కకుండానే తల్లిదండ్రులు ఈ లోకాన్ని వీడటం అందరినీ కలచివేసింది. ఈ ఘటన గని ఆత్కూరులో తీవ్ర విషాదాన్ని నింపింది.