వివాహ బంధం కంటే.. వివాహేతర బంధం బలంగా మారింది. ఎంతలా అంటే.. తాళి కట్టిన మొగుడ్ని ముక్కలు ముక్కలు చేసేంతలా. యూపీ మీరట్ లో ప్రియుడితో కలిసి భర్తను 16 ముక్కలు చేసి డ్రమ్ లో దాచిపెట్టిన ముస్కాన్ క్రైమ్ కహానీ ఇలా బయటికొచ్చిందో లేదో.. అంతలోనే రాజస్థాన్ జైపూర్ లో మరో భార్య రాసిన మరణ శాసనం కలకలం రేపింది. ప్రియుడి మోజులో భర్తను చంపేసి.. ఆనవాళ్లు లేకుండా చేయాలని చూసింది ఆ ఇల్లాలు. భర్త నుంచి తప్పించుకోగలిగింది కానీ.. చట్టం నుంచి తప్పించుకోలేకపోయింది. రాజస్థాన్ జైపూర్ లోని ముహానా ప్రాంతంలో ధన్నాలాల్ సైని, గోపాలీ దేవి దంపతులు నివసిస్తున్నారు. సైని స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. గోపాలీ దేవి ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలోకి వివాహేతర సంబంధం చిచ్చు రాజేసింది. గోపాలీ దేవికి.. స్థానికంగా బట్టల దుకాణం నడుపుతున్న దీన్ దయాళ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు ఫ్యాక్టరీకి వెళ్తున్నానని చెప్పి.. దీన్ దయాళ్ బట్టల దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టింది గోపాలీ దేవి.
గోపాలి దేవి ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఫ్యాక్టరీకి వెళ్తుందా.. లేదా.. అంటూ మార్చి 15న ఆమెను ఫాలో అయ్యాడు. ఈ విషయం తెలియని గోపాలి దేవి.. ఎప్పటిలాగే ఫ్యాక్టరీకి కాకుండా దీన్ దయాళ్ షాపుకి వెళ్లింది. ఇది గమనించిన భర్త సైని.. వెంటనే షాపులోకి వెళ్లి చూడగా.. తన భార్యతో దీన్ దయాళ్ ను చూసి షాక్ తిన్నాడు. అక్కడే దీన్ దయాళ్ తో గొడవపడ్డాడు. అయితే భర్తకు తమ వివాహేతర సంబంధం తెలియడంతో గోపాలీ దేవి చాలా పెద్ద ప్లాన్ వేసింది. భర్త అడ్డు తొలగిస్తే.. ప్రియుడితో జీవితాంతం సుఖంగా ఉండొచ్చని భావించింది. అదే బట్టల దుకాణంలో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసింది. ఇనుపరాడ్డుతో తలపై కొట్టడంతో సైని అక్కడికక్కడే మృతి చెందాడు.
సైనిని చంపేసిన గోపాలి దేవీ, దీన్ దయాళ్.. మృతదేహాన్ని దూరంగా అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టాలని ప్లాన్ వేశారు. దీంతో మృతదేహాన్ని పెద్ద సంచిలో కుక్కి.. బైక్ పై జాతీయ రహదారి పక్కనే ఉన్న నిర్మానుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ డెడ్ బాడీని తగలబెట్టి వెళ్లిపోయారు. సగం కాలిన డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీఫుటేజీలను పరిశీలించగా.. మృతుడి భార్య, ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు.