బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు లోబో, అలియాస్ ఖయూమ్‌కు రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరి మృతికి కారణమయ్యారు లోబో. ఈ ఘటనపై విచారణ జరిపిన జనగామ కోర్టు సంవత్సరం జైలు శిక్షతో పాటు 12,500 జరిమాన విధించింది.
2018 మే 21న లోబో తన టీవీ ఛానల్ కార్యక్రమం కోసం వరంగల్ జిల్లాలోని రామప్ప, లక్నవరం, భద్రకాళి ఆలయం వంటి ప్రాంతాలను సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన స్వయంగా కారు నడుపుతున్నారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిడిగొండ గ్రామం సమీపంలో ఆయన కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి గ్రామానికి చెందిన మణెమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను జనగామ కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం లోబో కు శిక్ష విధించింది.