ప్రభుత్వ , భూదాన్ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఈడీ విచారణ వేగవంతం చేసింది. అయితే, ఆ ఘటన మరువక ముందే తాజాగా.. అమోయ్ కుమార్‌తో సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌లపై కొండపూర్ వాసులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని మీజీద్ బండీలో ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్‌కు ఓ కుటుంబం దానం చేసింది. కాగా, ట్రస్ట్ భూమిపై కన్నేసిన అధికారులు అదే భూమిలో నుంచి భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తూ అక్రమంగా జీవో నెం.45ను జారీ చేశారని బాధితులు ఈడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్‌లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.