Palakkad MLA : లైంగిక వేధింపుల ఆరోపణలు... పాలక్కాడ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
కేరళలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూతతిల్‌ను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. రాహుల్ మామ్‌కూతతిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మాత్రం కాంగ్రెస్ పక్కనపెట్టింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) రాహుల్ మామ్‌కూతతిల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. పలువురు మహిళల నుంచి ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. గతంలో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ మామ్‌కూతతిల్.. ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పార్టీలో అంతర్గతంగా, వెలుపల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. కానీ, మధ్యంతర ఎన్నికలు వస్తాయనే భయంతో పార్టీ ఆ నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ మామ్‌కూతతిల్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.