Sajjanar : గ్రామాల్లోనూ పెరిగిన సైబర్ నేరాలు.. సజ్జనార్ హెచ్చరిక

Update: 2024-09-24 12:00 GMT

గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలు పేట్రేగిపోతున్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎక్స్ వేదికగా సజ్జనార్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.సైబర్ నేరాల నివారణకు స్వీయ అవగాహన కలిగి ఉండటం ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన యువ కిరణం అసోషియేషన్ కృషి అభినందనీయమని తెలిపారు.

వారు ముద్రించిన కరపత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ మోసాలు, నేరాలు-పాటించాల్సిన జాగ్రత్తలపై కరపత్రంలో వారు ముద్రించారు. ఫెడెక్స్ పార్సిల్ అంటూ మోసాలు, ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరింపులు, ఈ-కేవైసీ పేరుతో కుచ్చుటోపి, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్లో పెట్టుబడులంటూ సోషల్ మీడియాపై లింక్స్.. లాంటి పద్దతులతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అవగాహన కల్పించారన్నారు.

సైబర్ మోసాలపై టోల్ ఫ్రీ 1930 నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నేరుగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు.

Tags:    

Similar News