Water Tanker Incident : వాటర్ ట్యాంకులో శవం.. ఆ ట్యాంకు నీళ్లే తాగుతున్న ప్రజలు
నల్లగొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో ఓ వ్యక్తి శవం బయటపడింది. అతడు పది రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ట్యాంకు నుంచి వచ్చే మంచినీళ్లనే పాత బస్తీ, హిందూపూర్‌తో పాటు పలు కాలనీల ప్రజలు తాగుతున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... పాతబస్తీ హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)కు అనారోగ్య సమస్యలతో పాటు మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో ఈనెల 24న రాత్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజుల నుంచి ట్యాంకు నుంచి వస్తున్న నీళ్లు వాసన వస్తుండడం, రుచి కూడా తేడాగా ఉండడంతో 11 వార్డు ప్రజలు మున్సిపల్అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ట్యాంకులో చూడగా ఓ డెడ్‌బాడీ కనిపించింది. స్థానికులు శవాన్ని చూసి వంశీకృష్ణగా గుర్తించారు. రోజుల తరబడి మంచినీటి ట్యాంకులను చెక్ చేయకపోవడం వల్లే తాము డెడ్‌బాడీ ఉన్న నీళ్లను తాగాల్సి వచ్చిందని వార్డు ప్రజలు మండిపడ్డారు. కొద్ది రోజుల కింద నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లో 30 కోతులు మృతి చెందిన ఘటన మరువక ముందే మళ్లీ అదే తరహా ఘటన నల్లగొండ మున్సిపాలిటీలోని వెలుగు చూసింది.
వాటర్ ట్యాంకులో శవం బయటపడిన ఘటనను విచారించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రను కలెక్టర్ దాసరి హరిచందన నియమించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.